మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర్‌తో సాధ్యం అవుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని సోమవారం నాడు మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలు, మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడుచుకుంటూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు తాగునీరు, సాగునీరు, వైకుంఠంధామలు, కులమతాలకు అతీతంగా పథకాల అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ట్రిక్కులు చేసినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదన్నారు. ప్రజలు ఆ పార్టీని అస్సలు నమ్మరు. పేదలకు దేవుడు కేసీఆర్ అని.. పేదలకు మేలు చేసే ముఖ్యమంత్రినే మరోసారి ప్రజలు ఎన్నుకుంటారని తెలిపారు మంత్రి మల్లారెడ్డి.