స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకు నిరసగా గాంధీ జయంతి రోజున టీడీపీ పిలుపు మేరకు చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్ష ముగిసింది. రాజమండ్రిలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, ఢిల్లీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘సత్యమేవ జయతే దీక్ష’ను విరమించారు. లోకేష్, టీడీపీ ఎంపీలకు చిన్నారులు నిమ్మరస ఇచ్చారు. కాగా ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు 8 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టారు. లోకేష్, టీడీపీ ఎంపీలతోపాటు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. కాగా చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులు, అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా తెలుగురాష్ట్రాలతోపాటు ఢిల్లీలో కూడా టీడీపీ శ్రేణులు దీక్షలు చేపట్టాయి.
ఇక ఢిల్లీలో లోకేష్ చేపట్టిన సత్యమేవ జయతే దీక్షకు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజుతోపాటు ఢిల్లీలోని తెలుగు సంఘాలు, ఢిల్లీ యూనివర్సిటీ తెలుగు విద్యార్థులు, ఢిల్లీలోని తెలుగువారు మద్ధతు తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టును వారంతా ఖండించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ప్రజల కోసం టీడీపీని ప్రారంభించారని, ఏనాడు మా కుటుంబంపై అవినీతి ఆరోపణలు లేవన్నారు. మేము ఎప్పుడూ అధికార దుర్వినియోగం చేయలేదని, ఈ దీక్ష ప్రజల కోసం చేశానన్నారు. తన ఆయుష్షు కూడా పోసుకుని చంద్రబాబు జీవించాలని ఆమె ఉద్వేగ్నంగా ప్రసంగించారు. అవసరమైనప్పుడు తాను ప్రజలతోనే ఉంటానని, వారి కోసమే పోరాడతానని భువనేశ్వరి తెలిపారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు. చంద్రబాబు రోజుకు 19 గంటలు ప్రజల కోసం పనిచేసేవారన్నారు.