హైదరాబాద్ నగరాన్ని ఏకధాటి వర్షాలు ముంచెత్తుతున్నాయి. నాలుగు రోజులుగా ముసురు పట్టిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, బోరబండ, కూకట్‌పల్లి, మాదాపూర్, ఫిల్మ్‌నగర్ తదితర ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 9000113667ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులను మేయర్ గద్వాల విజయలక్ష్మి అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్‌ఎఫ్ టీంలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. శిథిలావస్థ భవనాల్లో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని నగర వాసులకు మేయర్ విజ్ఞప్తి చేశారు. మరో ఐదు గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మేయర్ సూచించారు.