పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని మోదీ కోరారు. అన్ని అంశాలపై పార్లమెంటులో చర్చలు జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు.
ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభ్యులంతా సహకరించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలు సభలో ప్రస్తావించేందుకు మంచి సమయం దొరుకుతుందని.. ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ సమావేశాల్లో ప్రజలకు ఉపయోగపడే అనేక బిల్లులు తెస్తున్నామని వెల్లడించారు. ముఖ్యమైన బిల్లులపై చర్చించేందుకు ఈ సమయం వినియోగించుకోవాలని విపక్షాలకు సూచించారు.
మరోవైపు ఈ సమావేశాల తొలిరోజు.. మణిపుర్లో తలెత్తిన పరిస్థితులపై చర్చించాలని డిమాండ్ చేస్తూ పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఉభయసభల్లో నోటీసులు ఇచ్చారు. మణిపుర్లో ఇద్దరు మహిళలు ఊరేగించిన వీడియో వైరల్ అవ్వడం వల్ల ఈ వివాదంపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.