తెలంగాణలో గురువారం రోజున కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేతల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైను కలిసింది.
ఆ పార్టీ నేతలు మహేశ్‌కుమార్ గౌడ్, మల్లు రవి తదితరులతో కూడి బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమైంది. సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎన్నుకున్నట్లు ఉన్న లేఖను వారు తమిళిసైకి అందజేశారు. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఆమెకు ఇచ్చారు. అనంతరం రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను నేతలు కోరారు. దీనికి తమిళిసై అంగీకరించినట్లు హస్తం నాయకులు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేయిస్తానని గవర్నర్ చెప్పినట్లు వెల్లడించారు.
మరోవైపు రేపు ఎల్బీ స్టేడియంలో జరగబోయే ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సీఎస్ శాంతి కుమారితో పాటు డీజీపీ రవి గుప్తా, ఇతర కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నేతలు రానుండటంతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు.