ఈనెల 27 నుంచి మూడ్రోజులపాటు గవర్నర్ జిల్లాల పర్యటన

-

ఈ నెల 27 నుంచి మూడు రోజులపాటు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ జిల్లాల పర్యటన చేయనున్నారు. వరంగల్‌, యాదాద్రి జిల్లాల్లో ఆయన పర్యటించనున్నట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 27న యాదాద్రి ఆలయం దర్శించుకోనున్నారని వెల్లడించాయి. అక్కడి నుంచి నేరుగా ములుగు జిల్లాకు వెళ్లి వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన అవార్జు గ్రహీతలతో సమావేశమవనున్నట్లు పేర్కొన్నాయి. యునెస్కో గుర్తింపు పొందిన కాకతీయ కళా ఖండం రామప్ప ఆలయాన్ని వీక్షించి గవర్నర్ లక్నవరం సరస్సును సందర్శించనున్నారు.

మరుసటి రోజు ఆగస్టు 28వ తేదీన హనుమకొండలో పేరొందిన కళాకారులు, ప్రముఖులతో గవర్నర్ జిష్ణుదేవ్ సమావేశం కానున్నారు. అనంతరం వరంగల్ ఖిల్లాను, భద్రకాళీ, వేయిస్తంభాల ఆలయాలను సందర్శిస్తారు. మూడో రోజు జనగామ జిల్లాలో కవులు, కళాకారులతో సమావేశమై అక్కడి నుంచి కొలనుపాకను సందర్శించనున్నారు. గవర్నర్ పర్యటనకు నాలుగు జిల్లాల యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version