తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ఆయన రాజీనామా లేఖ సమర్పించారు. అయితే ఆమె రాజీనామా ఆమోదించి తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ రాశారని వార్తలొచ్చాయి. అయితే ఇందులో వాస్తవం లేదని తాజాగా రాజ్ భవన్ స్పష్టం చేసింది. జనార్ధన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించలేదని ఓ ప్రకటనలో పేర్కొంది. పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్‌కు అన్ని వివరాలు పంపించామని, ఆమె ఇంకా ఆమోదించలేదని ప్రకటనలో స్పష్టం చేసింది.
ఇక రాజీనామాకు ముందు జనార్దన్ రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో నిర్వహించిన గ్రూప్ వన్, ఏఈఈ ప్రశ్నాపత్రాలు లీకైన సందర్భంలో జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడే ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా అప్పటి ప్రభుత్వం అందుకు ఆమోదం తెలపలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో.. జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.