హైదరాబాద్ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశమైంది. ఛైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ తరఫున రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ హాజరయ్యారు. గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతుల ఆలస్యంతో ప్రాజెక్టుల ఖర్చు పెరుగుతోందని రజత్ కుమార్ అన్నారు. హైడ్రాలజీ, పర్యావరణ అనుమతులు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు సరికాదని తెలిపారు. ఇప్పటికే ముంపు సమస్య ఉండగా.. పోలవరం మీద ఏపీ కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని చూస్తోందని ఆరోపించారు.
అవసరం ఉన్న చోట టెలిమెట్రీ ఏర్పాటు చేయాలి కానీ, అవసరం లేని చోట ఎందుకని రజత్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రానికి మేలు జరిగేలా నదుల అనుసంధానం జరగాలని కోరారు. ఉమ్మడి ఏపీకి గోదావరి జలాల లభ్యతను తేల్చేందుకు అధ్యయనంపై చర్చతో పాటు బోర్డు నిర్వహణ, నిధులు, ఉద్యోగులు, సీడ్ మనీ, వసతి తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.