వచ్చే శాసనసభ ఎన్నికల్లో నూటికి నూరు శాతం కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదిస్తే.. ముంపు సమస్యను తగ్గించవచ్చని, అది కాదంటే ఏడు మండలాలు లేదా భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న అయిదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. గవర్నర్ రాజ్యాంగం పరిధిలో వ్యవహరించాలని, హద్దు దాటితే ప్రజలు సహించబోరన్నారు.
‘’మునుగోడులో ఉప ఎన్నిక రాకపోవచ్చు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరుతుండవచ్చు. కానీ రాజీనామా చేయరు. రాజీనామా చేస్తే ఆయనే మునిగిపోతారు. నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదు. హుజూరాబాద్ పరిస్థితులు వేరు.. మునుగోడు వేరు. ఉప ఎన్నిక జరిగితే ఆ నియోజకవర్గాన్ని తెరాస దక్కించుకుంటుంది. మండలి ఛైర్మన్ పదవిలో నేను సంతృప్తిగా ఉన్నాను.’ అని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
‘ జమ్మూ కశ్మీర్‌లో నియోజకవర్గాలను పెంచిన కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ఆ అవకాశం కల్పించకపోవడం దారుణం. కేంద్రం నిర్వాకం వల్లనే తెలంగాణలో ఆర్థికసమస్యలు తలెత్తుతున్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల పేరిట రెండు నెలలుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వడం లేదు. దీంతో ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా అందుతున్నాయి. కానీ జీతాలు అసలు రాలేదనడం భావ్యం కాదు. వైఎస్ షర్మిలకు రాజన్న రాజ్యం కావాలంటే ఆంధ్రకు వెళ్లాలి. తెలంగాణలో ఎందుకు? అసలు రాజన్న రాజ్యం ఉంటే తెలంగాణ వచ్చేదా..?’’ అని గుత్తా ప్రశ్నించారు.