తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేస్వామి ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా గర్భాలయంలో కొలువుదీరిన ఆంజనేయస్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం నిర్వహించి, రకాల పండ్లు, పూలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హనుమాన్ భక్తులు తరలి వచ్చారు. భక్తులతో క్యూలైన్లు, ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
హనుమాన్ జయంతి కావడంతో రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ఉదయాన్నే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ముఖ్యంగా అంజన్న మాలధారులు వచ్చి ఇక్కడ దీక్ష విరమిస్తున్నారు. దాదాపు 3 లక్షల మంది దీక్షాపరులు ఈ ఏడాది దీక్ష విరమించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీక్షాపరులతో ఆలయ పరిసరాలన్నీ కాషాయవర్ణాన్ని సంతరించుకున్నాయి.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాద్రి సీతారామస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రధాన ఆలయం ఎదుట ఉన్న ఆంజనేస్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు.