కాంగ్రెస్ కు దమ్ముంటే…తెలంగాణ పథకాలను అమలు చేయాలని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మైనార్టీ బంధు , బీసీ బంధు లబ్ధిదారుల తోపాటు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు హరీష్ రావు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం లో అభివృద్ధి పండుగ జరగుతుంది.
నిన్న ఒకేసారి 9 మెడికల్ కాలేజీ లు ప్రారంభించాము ఈరోజు పాలమూరు ప్రాజెక్ట్ ను సీఎం కెసిఆర్ ప్రారంభిస్తున్నారని వెల్లడించారు. ఎలాంటి షరతులు లేకుండా ఒక రూపాయి అప్పు లేకుండా నేరుగా లక్ష రూపాయలు బీసీ బంధు కింద ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలని…దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలను బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసిందని చెప్పారు.
కర్ణాటకలో ముస్లిం మైనార్టీలు 90 లక్షల మంది ఉన్నారు. మహారాష్ట్రలో కోటి 50 లక్షల మంది ఉన్నారు. బెంగాల్ లో రెండు కోట్ల 55 లక్షల మంది అదేవిధంగా ఉత్తర్ ప్రదేశ్లో నాలుగు కోట్ల మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో 2 వేల కోట్లకు మించి ముస్లిం మైనార్టీల కోసం బడ్జెట్ కేటాయించలేదని మండిపడ్డారు. అదే తెలంగాణ లో 50 లక్షల మంది ముస్లిం మైనార్టీలు ఉంటే వారి కోసం రెండు వేలకోట్ల బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు.