వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు బాండ్ పేపర్ రాసిచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు అన్నారు. గతంలో బాండ్ పేపర్‌కు విలువుండేది.. రేవంత్ మోసంతో దాని విలువ పోయిందని పేర్కొన్నారు. బాండ్ పేపర్లను నమ్మట్లేదని ఎక్కడికెళితే అక్కడి దేవుళ్లపై ఒట్టు పెడుతున్నారని విమర్శించారు. రేవంత్.. దేవుడిపై ఒట్టు పెట్టినా, తనపై తాను ఒట్టు పెట్టుకున్నా ఎవరూ నమ్మరని వ్యాఖ్యానించారు.
“ఆగస్టు 15లోపు రుణమాఫీ, ఆరు హామీలు అమలు చేయాలి. హామీల అమలుపై అమరవీరుల స్తూపం వద్దకు రావాలి. ఇద్దరి రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15లోపు హామీలు అమలు చేస్తే రాజీనామా లేఖ స్పీకర్‌కు ఇవ్వాలి. హామీలు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ గవర్నర్‌కు ఇవ్వాలి.” అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి నామినేషన్ ర్యాలీలో హరీశ్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మాట నమ్మడం అంటే నీళ్లు లేని బావిలో దూకినట్లేనని విమర్శించారు. బీజేపీ ఒక్క వర్గానికి కూడా మేలు చేయలేదన్నారు. ఆ పార్టీ హయాంలో పెట్రోల్ డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్నంటాయని తెలిపారు.