కాంగ్రెస్ ప్రభుత్వానికి 24 గంటల డెడ్‌లైన్ విధించారు మాజీ మంత్రి హరీష్ రావు. 24 గంటల్లో కూడవెల్లి వాగుకు నీరు విడుదల చేయకుంటే.. మల్లన్న సాగర్‌ను ముట్టడి చేసి మేమే మల్లన్న సాగర్ గేట్లను తెరుస్తాం అని హెచ్చరించారు హరీష్ రావు. కేసీఆర్ పొలంబాట పడితే.. నీళ్లు విడుదల చేస్తున్నారని చురకలు అంటించారు. ముందే నీళ్లు ఎందుకు విడుదల చేయలేదు..? అని నిలదీశారు. బీఆర్ఎస్ పోరాటం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు విడుదల చేస్తోందన్నారు హరీష్ రావు.
రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసింది.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. రైతులందరికీ మీరు హామి ఇచ్చినట్టే ప్రతి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలి..కొనుగోలు కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేసి రైతులు తీసుకువచ్చే ప్రతీ గింజను కొనుగోలు చేయాలన్నారు. ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ తక్షణం చేయాలని స్పష్టం చేశారు.