తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశంలో ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. సభ్యుల ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై చర్చకు వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ విలీనంపై తాము కసరత్తు చేస్తున్నామని చెప్పారు. అయితే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కలగజేసుకుంటూ దీనిపై మాట్లాడారు.
ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని.. కానీ వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు. ఆర్టీసీ కార్మికులను పీఆర్‌సీ పరిధిలోకి తెస్తామన్నారని ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు లేవని తెలిపారు. ఆర్టీసీ విలీనంపై ఎప్పటిలోగా అపాయింట్ డేట్ ప్రకటిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్మికుల యూనియన్ పునరుద్ధరణ ఎప్పుడు చేస్తారు? పీఆర్‌సీ బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారు? అని నిలదీశారు. ఫిబ్రవరి 10నే సీఎం చెక్కు చూపించారన్న హరీశ్ రావు.. ఇంకా చెల్లించలేదని మండిపడ్డారు. నెక్లస్‌రోడ్ నుంచి బస్‌భవన్‌కు చెక్కు ఎప్పుడు చేరుతుంది? అని ఎద్దేవా చేశారు.