రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని టీజీఐఐసీ తాజాగా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనపై తాజాగా హెచ్‌సీయూ రిజిస్ట్రార్ స్పందించారు. 2024 జూలైలో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని.. ఇప్పటివరకూ భూమి ఎలా ఉందని ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని తెలిపారు. హెచ్‌సీయూ.. హద్దులు అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు భూమి సరిహద్దులు గుర్తించలేదన్న రిజిస్ట్రార్.. దీనిపై హెచ్‌సీయూకి సమాచారం ఇవ్వలేదని.. ఆ భూమిని వర్సిటికే ఇవ్వమని చాలా కాలంగా కోరుతున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తాజాగా టీజీఐఐసీ ప్రకటన విడుదల చేసింది. ఈ భూమి యజమాని తానేనని కోర్టు ద్వారా గవర్నమెంట్ నిరూపించుకుంది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని కోర్టు ద్వారా దక్కించుకుంది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువులు లేవని.. సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీది కాదని తేలినట్లు టీజీఐఐసీ తన ప్రకటనలో తెలిపింది.