రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణను వానలతో ముంచెత్తుతున్నాయి. మరో పక్క బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయు గుండంగా మారడంతో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీని ప్రభావంతో మంగళ, బుధ వారాల్లో కూడా ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి.
ముఖ్యంగా ఏపీలోని ఉభయ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశా, తమిళనాడు, పాండిచ్చేరి తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు ఎగసిపడుతున్నాయి. అందువల్ల మంగళవారం మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. పలు పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరోపక్క భారీ వర్షాల వల్ల అవాంఛనీయ ఘటనలు జరిగితే ప్రజలకు తక్షణం సేవలందించేందుకు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రంలోని పోలీసులను డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. ఈ విషయమై సోమవారం రాత్రి ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఆయన మాట్లాడారు.