తెలంగాణను గత వారం రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కనీస కనికరం లేకుండా రాష్ట్రంలో వరణుడు విరుచుకుపడుతున్నాడు. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు వంకలు పొంగిపొర్లి వరదంతా రహదారులపైకి చేరింది. ఇక పలు గ్రామాల్లో ఊళ్లు ఏర్లుగా మారాయి. జలదిగ్బంధంలో చిక్కుకుని ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై చర్యలకు ఉపక్రమించింది.
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. శుక్రవారం రోజున సెలవు ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సెలవులపై ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ సెలవు ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో గత మూడ్రోజులుగా విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు కురుస్తున్నందున పిల్లలను ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తల్లిదండ్రులకు సూచించారు.