తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ క్షణం నుంచి అప్రమత్తమైన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఈ తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా భారీగా నగదు, బంగారం, మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు.
తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.625 కోట్లను దాటింది. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఇప్పటివరకు రూ.625 కోట్ల 79 లక్షలకుపైగా మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు . రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. గడచిన 24 గంటల్లో 18 కోట్ల 64 లక్షలకుపైగా నగదు స్వాధీనం కాగా ఇప్పటివరకు స్వాధీనమైన మొత్తం 232 కోట్లా72 లక్షలకుపైగా ఉందని వెల్లడించారు.
180 కోట్ల 60 లక్షలకుపైగా విలువైన బంగారం, ఇతర ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వికాస్ రాజ్ చెప్పారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మద్యం విలువ 99 కోట్ల 49 లక్షలకు పైగా ఉండగా… మత్తు పదార్థాల విలువ 34కోట్ల 35 లక్షలకుపైగా ఉంది. వాటితోపాటు 78 కోట్ల 62 లక్షలకుపైగా విలువైన ఇతర వస్తువులు పట్టుబడినట్లు వికాస్‌రాజ్ వివరించారు.