డివైడర్​ను ఢీకొట్టిన అంబులెన్స్.. మంటలు చెలరేగి డ్రైవర్ మృతి

-

హైదరాబాద్​లో ఓ అంబులెన్స్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్ మహేశ్(35) దుర్మరణం చెందాడు. నగరంలోని బీఎన్‌రెడ్డి నగర్‌ చౌరస్తాలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగిని అతడి ఇంటి వద్ద వదిలిపెట్టి తిరిగి వస్తుండగా అంబులెన్స్‌ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలక్‌పేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగిని అంబులెన్స్‌లో ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా సాగర్‌ రహదారిపై బీఎన్‌ రెడ్డి చౌరస్తా వద్ద డివైడర్‌ను అంబులెన్స్‌ ఢీకొట్టింది. అతివేగంతో ఢీకొట్టడంతో వాహనం బోల్తాపడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అయితే అదే సమయంలో అంబులెన్స్‌లో ఉన్న ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలడంతో వాహనం ధ్వంసం కావడంతో పాటు అందులో డ్రైవర్ మృతి చెందాడు. మహేశ్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై ఇతర వాహనాలేవీ లేకపోవడంతో ఎవరికీ గాయాలు కాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version