హైదరాబాద్‌కు చెందిన బిల్డర్ కర్ణాటకలోని బీదర్‌లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై కర్ణాటకలోని మన్నేకెళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇతని తలపై బండరాయితో కొట్టి ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని వెల్లడించారు. మధు ఒంటిపై ఉన్న బంగారం, నగదు కనిపించడం లేదని, నిందితులు వీటిని తీసుకుని పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు.
మృతుడి బంధువుల కథనం ప్రకారం.. జీడిమెట్లలోని కల్పన సొసైటీలో ఉండే బిల్డర్ కుప్పాల మధు(48)కు ట్రావెల్స్ వ్యాపారమూ ఉంది. మధు వ్యాపారం నిమిత్తం తరచూ బీదర్‌కు వెళ్లేవారు. ఈ క్రమంలోనే ఈనెల 24న బీదర్ వెళ్లారు. రాత్రి 10 గంటలకు భార్య ఫోన్ చేయగా హైదరాబాద్ వస్తున్నట్లు మధు చెప్పారు. గంట తర్వాత మధుకు భార్య మళ్లీ ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. తెల్లవారినా మధు రాలేదు.
మరోవైపు బీదర్ జిల్లాలోని మన్నేకెళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో 25వ తేదీ ఉదయం రోడ్డు పక్కన నిలిపిన కారు వద్ద మృతదేహం ఉందని, కారు నంబరు ఆధారంగా మృతుడు మధు అని గుర్తించారు. 25వ తేదీన జీడిమెట్ల పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.