హైదరాబాద్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బిర్యానీ. హైదరాబాద్ వచ్చిన వారు కచ్చితంగా దమ్ బిర్యానీ తినాల్సిందే అనుకుంటారు. అందుకే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లలోనూ బిర్యానీలదే హవా ఉంటుంది. మాంహాహారమైతే హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఆరడర్లలో ఇంకేదీ పోటీకి రాదు. మరి శాకాహారంలో హైదరాబాద్ వాసులు ఎక్కువగా ఏం తింటున్నారో తెలుసా?
హైదరాబాద్లో వెజిటేరియన్స్ ఎక్కువ ఏం తింటున్నారో చెప్పేసింది స్విగ్గీ రిపోర్ట్. మన హైదరాబాదీలు ఎక్కువగా ఇడ్లీ, దోశలనే ఆర్డర్ చేస్తున్నారట. ఈ సౌతిండియన్ డిషెస్ను కేవలం హైదరాబాద్ వాసులే కాకుండా.. ఉద్యోగం, విద్య పేరిట నగరానికి వచ్చిన ఉత్తర భారతీయులు ఇష్టపడుతున్నారట. శాకాహార వంటల ఆర్డర్లలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచిందని బుధవారం రోజున తన నివేదికలో ప్రకటించింది. మసాల దోశ, ఇండ్లీలను హైదరాబాదీలు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని చెప్పింది. దేశంలో అత్యధికంగా ఆర్డర్ అవుతున్న పది వంటకాల్లో ఆరు శాకాహారం వంటకాలే ఉన్నాయని తెలిపింది. స్విగ్గీ రిపోర్టులో తొలి రెండు స్థానాల్లో బెంగళూరు, ముంబయి నగరాలు నిలిచాయి.