జీహెచ్ఎంసీ నూతన కమిషనర్ గా ఐఏఎస్ అధికారి ఇలంబర్తి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్నటువంటి ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్ కి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని రవాణా శాఖ కమిషనర్ గా ఉన్న ఇలంబర్తి తో భర్తీ చేశారు. ఆయన కమిషనర్ గా తన బాధ్యతలు చేపట్టారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులు, సిబ్బంది పుష్ప గుచ్చాలతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం.. కేటాయించిన రాష్ట్రాల్లోనే రిపోర్టు చేయాలని పలువురు ఐఏఎస్ అధికారులకు డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని.. ప్రస్తుతం తాము ఎక్కడ పని చేస్తున్నామో అక్కడే ఉంచాలని కోరుతూ పలువురు ఐఏఎస్ అధికారులు క్యాట్, తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వారికి అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సిన ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణి ప్రసాద్ రిలీవ్ అయ్యారు.