ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 దాటితే బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా భానుడి ధగధగలకు విలవిలలాడిపోతున్న ప్రజలకు తాజాగా వాతావరణశాఖ (IMD) చల్లని కబురు చెప్పింది.

భూ ఉపరితలం వేడెక్కడంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు (Rains) కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. నాలుగో తేదీన వర్ష ప్రభావం తక్కువగా ఉండే అవకాశముందని వివరించారు.
వర్షాల కారణంగా 2, 3 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్,కామారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, వికారాబాద్ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని .. పలుచోట్ల ఈదురు గాలులు కూడా వీచే వీలుందని వెల్లడించారు.
