సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ లో నూతనంగా నిర్మించిన ఐటీసీ ఫుడ్ పరిశ్రమను సోమవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ నియోజకవర్గంలో ఇంత పెద్ద పరిశ్రమ రావడం సంతోషంగా ఉందన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశం కల్పించేలా ITC యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు.
కంపెనీ కోసం భూములు కోల్పోయిన వారికి ఆదుకునే బాధ్యత మనపై ఉందని.. కంపెనీ తయారు చేసే చిప్స్, బిస్కెట్స్ కోసం ఆలుగడ్డలు, గోధుమలు ఇక్కడే కొనాలని ITC చైర్మన్ కి విన్నవించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని తక్కువ సమయంలో పూర్తి చేశామన్నారు మంత్రి కేటీఆర్. 10 TMC ల నీరు పరిశ్రమలకు కాళేశ్వరం ద్వారా అందిస్తున్నామన్నారు. నీటి వనరుల్లో విప్లవం సాదించామన్నారు. ఇంటింటికి మంచి నీరు అందిస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ అన్నారు.
46 వేల చెరువులను మిషన్ కాకతీయ ద్వారా బాగు చేసామని తెలిపారు. ఫుడ్ ప్రాసెస్సింగ్ హబ్ కోసం స్పెషల్ సెజ్ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 68 లక్షల నుంచి మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి ఎదిగామన్నారు. కోళ్ల పరిశ్రమకి , దాణాకి తెలంగాణ కేంద్రంగా ఉందన్నారు. రైతుల ఆదాయం పెరగాలంటే వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలు అభివృద్ధి చెందాలని మేము దృష్టి పెట్టామన్నారు.