బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మోదీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికి మోదీ కంటే ముందు ఈడీ వస్తోందని అన్నారు. నవంబర్, డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలు రావచ్చని.. ఎన్నికలకు ముందు దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం బీజేపీ విధానమని చెప్పారు. తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేయడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు.
“ఈడీ విచారణకు నేను పూర్తిగా సహకరిస్తాను.11న వస్తానని చెప్పినా 9న రావాలని ఈడీ నోటీసు ఇచ్చింది. మహిళలను ఇంటికొచ్చి విచారించాలనే చట్టం చెబుతోంది. మహిళలను విచారించే విధానాలకు విరుద్ధంగా నన్ను విచారణకు పిలిచారు. నేను ఈడీ ముందుకు ధైర్యంగా వచ్చి.. విచారణ ఎదుర్కొంటాను. బీఎల్ సంతోష్ సిట్ ముందుకు ఎందుకు రాలేదు? సిట్ ముందుకు వచ్చేందుకు బీఎల్ సంతోష్‌కు భయమెందుకు? బీజేపీ నేతలు, బీజేపీలో చేరిన నేతలపై కేసులు ఉండవు. బీజేపీను ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తూ.. కేసులు పెడుతోంది.” – కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ