అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ పార్టీ ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలపై దృష్టి సారించింది. ఓవైపు పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతూ మరోవైపు నేతలు పార్టీని వీడకుండా ఉండేందుకు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. ఇందుకోసం రంగంలోకి దిగిన పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు.
త్వరలోనే బీఆర్ఎస్కు పూర్వవైభవం వస్తుందని ఆశా భావం వ్యక్తం చేసిన కేసీఆర్ ఈసారి తప్పకుండా గులాబీ పార్టీకే ప్రజలు పట్టం కడతారని పేర్కొన్నారు. తాజాగా ఆయన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రజాజీవితంలో ఏ పాత్ర ఇచ్చినా… అందులో ఒదిగిపోవాలని వారికి సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను ఎదుర్కొన్న కష్టాలను కార్యకర్తలకు వివరించారు. సమైక్యవాద, కుటిల వ్యవస్థలనే బద్దలుకొట్టి స్వరాష్ట్రాన్ని సాధించి, కలబడి నిలబడ్డామన్నారు. భవిష్యత్తులో ఎటువంటి ప్రతిబంధకాలనైనా… తెలంగాణ సమాజం ధిగమిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ…వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు.