సాహిత్యం, చిత్రకళ, పోటోగ్రఫీ తదితర సాంస్కృతిక, సృజనాత్మక రంగాల ద్వారా తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబిస్తూ, తమ జీవిత కాలం కృషి చేసిన నాటి తెలంగాణ కళాకారుల కుటుంబాలను ఆదుకుంటూ మానవీయ పాలన సాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ దిశగా మరో నిర్ణయం తీసుకున్నది.
ప్రఖ్యాత ఫోటో జర్నలిస్టు, చిత్రకారుడు, దివంగత భరత్ భూషణ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. భరత్ భూషణ్ కుటుంబానికి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ హైదరాబాద్ లోని జియాగూడలో డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించి ఆదుకున్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన వారి కుటుంబానికి తానున్నానంటూ రాష్ట్ర ప్రభుత్వం భరోసానిచ్చింది.
గతంలో భరత్ భూషణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి ఆరోగ్య నిధి నుండి ప్రభుత్వం చేయూతనందించింది. తమను కష్టకాలంలో ఆదుకుంటూ, ఇప్పుడు తమకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించి మరోసారి అండగా నిలిచినందుకు భరత్ భూషణ్ భార్య శ్రీమతి సుభద్రమ్మ, వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ కు, మంత్రి శ్రీ కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.