కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ ఆకలి చావులే అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన గజ్వేల్ సభలో మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం అని ప్రచారాన్ని కొనసాగించిన కాంగ్రెస్ పార్టీపై కూడా కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఆకలి రాజ్యం, ఎమర్జెన్సీ, ఎన్‌కౌంటర్లు, రక్తపాతం జరిగాయని కేసీఆర్ గుర్తు చేశారు. దళితులు, గిరిజనులను పట్టించుకోలేదని, వారిని ఓటు బ్యాంకుగానే చూశారని కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 2 రూపాయాలకే కిలో బియ్యం ఎందుకు ఇచ్చారని, రామారావు ఆ బియ్యం ఇవ్వడంతోనే పేదల కడుపు నిండిందని కేసీఆర్ ప్రజలకు విడమరిచి చెప్పి, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ఎండగట్టారు.
కాంగ్రెస్, బీజేపీ చేసిన మోసాలను కేసీఆర్ బట్టబయలు చేశారు. ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, మెదక్ లాంటి జిల్లాల్లో పరిశ్రమలను మూయించిందే కాంగ్రెస్ పార్టీ అని, కార్మికులను రోడ్డు న పడేసిందే కాంగ్రెస్ నేతలు అని కేసీఆర్ దుమ్మెత్తిపోశారు. నాణ్యమైన కరెంట్ ఇవ్వకుండా రైతులను మోసం చేశారని, పరిశ్రమలు కూడా తరలిపోయేలా చేశారని కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ కరువుకు, వలసలకు నిలయంగా మారిందని సీఎం గుర్తు చేశారు.