తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మూడోరోజు సమావేశాల్లో రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు పద్దును ప్రవేశపెడతారు. అయితే ఇవాళ్టి బడ్జెట్ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కానున్నట్లు గులాబీ పార్టీ వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు రావాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుపట్టినా ఆయన అసెంబ్లీ గడప తొక్కలేదు. మరోవైపు ఆయన కిందపడి శస్త్రచికిత్స జరగడం, అనారోగ్య కారణాల వల్ల కూడా హాజరు కాలేకపోయారు. అయితే ఈ సమావేశాల్లో ఆయన తప్పకుండా సభకు వస్తారని ఇప్పటికే గులాబీ నేతలు తెలిపారు. ఈ క్రమంలోనే ఇవాళ్టి బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ రానున్నట్లు తెలిసింది. ఇవాళ్టి సమావేశాలు మధ్యాహ్నం 12 గంటలకు మొదలు కానున్నాయి.