భారత హరిత విప్లవ పితామహుడు.. ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ మరణించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. వారి మరణంతో దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఆధారిత భారతదేశంలో మెజార్టీ ప్రజల జీవనాధారం.. దేశ ప్రజల సాంస్కృతిక జీవన విధానం వ్యవసాయ రంగంతో ముడిపడి ఉన్నదనే దార్శనికతతో, సాంప్రదాయ పద్దతిలో సాగుతున్న దేశీయ వ్యవసాయాన్ని ఎం ఎస్ స్వామినాథన్ వినూతన పద్దతుల్లో గుణాత్మక దశకు చేర్చారని సిఎం తెలిపారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందంటే అది ఎం. ఎస్ స్వామినాధన్ కృషితోనే సాధ్యమైందని చెప్పవచ్చని పేర్కొన్నారు.
దేశ ప్రజల ప్రధాన ఆహార వనరులైన వరి, గోధుమ తదితర పంటలపై ఎం.ఎస్.స్వామినాథన్ చేసిన అద్భుతమైన ప్రయోగాలతో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. వ్యవసాయ రంగంలో వారు చేసిన పరిశోధనలు సిఫారసులు దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయని సిఎం అన్నారు. దేశ జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార భధ్రత దిశగా దార్శనికతతో జీవిత కాలం కృషి చేసిన మొట్టమొదటి వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్ అని సిఎం అన్నారు. భిన్నమైన భౌగోళిక భూసార పరిస్థితులు కలిగి, దేశంలోని రాష్ట్రాల వారిగా ప్రజలు పండిస్తున్న పంటలపై వాటిని అభివృద్ధిపై విస్తృత పరిశోధనలు చేసిన ఎం ఎస్ స్వామినాథన్ ప్రతి భారత రైతు హృదయంలో స్థిరస్థాయిగా నిలిచిపోతాడని సిఎం అన్నారు.