హైదరాబాద్‌లో వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడు. మరి ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం ఎత్తు ఎంతో తెలుసా? అక్షరాల 70 అడుగులు. గత ఏడాది కంటే 7 అడుగులు ఎక్కువ. గతేడాది 2023లో ఖైరతాబాద్ మహాగణపతి ఎత్తు 63 అడుగులు ఉండగా ఈ ఏడాది దాన్ని 70 అడుగులకు పెంచారు. ఈ క్రమంలో ఈ భారీ వినాయకుడి విగ్రహం తయారీకి ఇవాళ కర్రపూజ నిర్వహించారు.
70 అడుగుల మట్టి విగ్రహం తయారు చేయించనున్నట్లు ఖైరతాబాద్ గణేశ్ మండలి నిర్వాహకులు తెలిపారు. ఇవాళ నిర్వహించిన కర్రపూజలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైరతాబాద్‌లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సంప్రదాయం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహం ఏర్పాటు ప్రారంభించామని వెల్లడించారు. గణేశ్ ఉత్సవాలకు ఈ ఏడాది కూడా మంచి ఏర్పాట్లు చేస్తామని వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉంటాయని పేర్కొన్నారు.