అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఇటీవల తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిపై కత్తి దాడి జరిగిన విషయం తెలిసిందే. కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి వరుణ్ రాజ్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. లూథరన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరుణ్‌రాజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడని వైద్యులు తెలిపారు. అతన్ని లైఫ్‌సపోర్టుపై ఉంచి చికిత్స అందిస్తున్నారని చెప్పారు. తీవ్రమైన నరాల బలహీనత ఏర్పడి ఎడమవైపు పాక్షిక వైకల్యం బారినపడే అవకాశం ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
వరుణ్‌రాజ్ చికిత్స, అతని తల్లిదండ్రుల అమెరికా ప్రయాణ ఖర్చుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) గోఫండ్‌లో విరాళాల సేకరిస్తోంది. బుధవారం రాత్రి వరకు 38 వేల డాలర్లు సమకూరినట్లు నాట్స్ సభ్యులు తెలిపారు. వాల్పరైసో యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న వరుణ్‌రాజ్ ఆదివారం రోజున పబ్లిక్ జిమ్ నుంచి తిరిగొస్తుండగా జోర్డాన్ ఆండ్రేడ్ అనే వ్యక్తి కత్తితో కణతలో పొడిచిన విషయం తెలిసిందే.. దాడికి గల కారణాలను ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.