టెంపోల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు ముడుతున్నాయన్న బీజేపీ ఆరోపణలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఆ ఆరోపణలను ఖండించిన ఖర్గే.. ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో మీరు ఎప్పుడు చూశారని ప్రశ్నించారు. టెంపోల్లో డబ్బు తరలిస్తుంటే ఐటీ, కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. అదానీ, అంబానీ నుంచి డబ్బులు వెళ్తుంటే వారి ఇళ్లలో సోదాలు చేయండని బీజేపీకి సూచించారు. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడటం ప్రధాని స్థాయికి తగదని హితవు పలికారు. హైదరాబాద్లో ఖర్గే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
‘ధనవంతుల వద్ద ఆస్తులు లాక్కుని పంచుతామనడం సిగ్గుచేటు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని గుర్తించాలి. ఇందిరాగాంధీ హయాంలో భూసంస్కరణలు తీసుకువచ్చారు. అభివృద్ధిని గాలికొదిలేసి విపక్షంపై ఆరోపణలే లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణకు పెద్ద ప్రాజెక్టులు ఏం తీసుకువచ్చారో చెప్పాలి. కాంగ్రెస్ హయాం నాటి ప్రాజెక్టులు ఏం ఇచ్చారో చెప్పాలి. కాంగ్రెస్ ఇచ్చిన విధంగా హామీలు అమలు చేస్తుంది. ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. పేద మహిళలకు ఏటా రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తాం.’ అని ఖర్గే స్పష్టం చేశారు.