తరచూ ధరల పెరుగుదలతో సామాన్యుడు బుక్క బువ్వ తినడానికే తిప్పలు పడుతున్నాడు. గతేడాది టమాట ధరలు ఠారెత్తించాయి. ఇటీవల ఉల్లిగడ్డ ధరలు ఊపిరాడకుండా చేశాయి. మొన్నటిదాకా పప్పుల ధరలు చూసి సామాన్యులు తినే సాహసం చేయలేకపోయారు. ఇక బియ్యం సంగతి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆకాశాన్నంటిన ధరలు నేలకు దిగిరానని గత కొంతకాలంగా మారాం చేస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా ఈ జాబితాలో ఎల్లిగడ్డ అదేనండి వెల్లుల్లి కూడా చేరింది.
ప్రస్తుతం వెల్లుల్లి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా రోజురోజుకు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా కిలో వెల్లుల్లి ధర ఏకంగా రూ.400 పలికిందంటే డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని వారపు అంగడిలో మంగళవారం కిలో ఎల్లిగడ్డ ధర రూ.400 పలికింది.
ఈ ఏడాది ఎల్లిగడ్డ పంట దిగుబడి సరిగా రాకపోవడంతో ధరలు బాగా పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. గత రెండు నెలల నుంచి ఎల్లిగడ్డ ధరలు క్రమంగా పెరుగుతూ ఇప్పుడు ఏకంగా కిలో ధర రూ.400కు చేరిందని తెలిపారు.