మరికాసేపట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో వీరు ఏ అంశాలపై చర్చిస్తారు అనేది ఆసక్తిగా మారింది. తెలంగాణలో కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని అటు తరుణ్ చుగ్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీలో జరుగుతున్న పరిణామాలపై వీరిద్దరూ చర్చించే అవకాశం ఉంది.
కొద్ది రోజులుగా పార్టీలోని సీనియర్ నేతలు బండి సంజయ్ తీరుపై అసంతృప్తితో ఉన్నారు అనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ని ఢిల్లీకి పిలిపించి చర్చించింది అధిష్టానం. ఆ తరువాత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పిలిపించి.. ఇప్పుడు కిషన్ రెడ్డితో చర్చలు జరుపుతోంది. ఇలా వరుసగా రాష్ట్ర నాయకులతో అధిష్టానం ఎటువంటి చర్చలు జరుపుతుందో తెలియాల్సి ఉంది.