ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నిరుద్యోగ సమస్యలపై ఆనాడు కేసీఆర్ చెప్పిన మాటలేంటి.. ఇప్పుడు చేస్తున్న పనులేంటని ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించడంలో బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ హాయాంలో ఓవైపు రైతుల ఆత్మహత్యలు.. మరోవైపు నిరుద్యోగుల బలవన్మరణాలు పెరిగిపోయాయని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న 24 గంటల నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
‘తెలంగాణ కోసం 1,200 మంది ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రం సిద్ధించినా ఇప్పటికీ యువతకు ఉద్యోగాలు రాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి యువతపై ధ్యాస లేదు. కేసీఆర్ సర్కార్ వస్తే ఉద్యోగాలు దొరుకుతాయని యువత భావించారు. కానీ కేసీఆర్ ఇంటికే ఉద్యోగాలు వచ్చాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది మంది నిరుద్యోగ యువత రోడ్డున పడ్డారు. 9 ఏళ్ల నుంచి డీఎస్సీ వేయలేదు. నిరుద్యోగ భృతి ఎక్కడికి పోయింది? కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయి. ఆర్థిక సాయం చేసి కాంగ్రెస్‌ను కేసీఆర్ బలోపేతం చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు యువత బుద్ధి చెప్పాలి.’ అని కిషన్ రెడ్డి అన్నారు.