తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. సీఎల్పీగా రేవంత్ రెడ్డి పేరును పార్టీ అగ్రనాయకత్వం దిల్లీలో ప్రకటించింది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీ గురువారం రోజున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అయితే.. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించడంపై ఆ పార్టీ కీలక నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.
మంగళవారం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ…. సీఎంగా రేవంత్ ఎంపికకావడం హర్షనీయం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ తీవ్రంగా కృషి చేశాడని కొనియాడారు. సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న సోదరుడు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు అని చెప్పారు. రేవంత్ సారథ్యంలో పాలకవర్గం ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంలో పార్టీ కట్టుబడి ఉంది అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.