చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి దుర్భాషలాడారాని శనివారం రోజున బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించినట్లు బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ సతీశ్ తెలిపారు. న్యాయ సలహా అనంతరం కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.
ఇన్‌స్పెక్టర్ సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వేశ్వర్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని తన ఇంట్లో ఉండగా రంజిత్ రెడ్డి ఫోన్ చేసి తన సర్పంచులతో ఎందుకు మాట్లాడుతున్నావంటూ బెదిరించారని, దూషించే ధోరణిలో మాట్లాడారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ మేరకు విశ్వేశ్వర్‌రెడ్డి ఫిర్యాదును స్వీకరించామని చెప్పారు. న్యాయసలహా అనంతరం కేసు నమోదు విషయాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.
మరోవైపు ఫిర్యాదు ఇచ్చిన అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక దిగజారిపోయిన వ్యక్తి, సంస్కృతి లేని భాషపై ఫిర్యాదు చేశానుని తెలిపారు. తొలుత ఫిర్యాదు చేయాలనుకోలేదన్న విశ్వేశ్వర్ రెడ్డి కొందరు పెద్దల సూచనల మేరకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు.