ఆహార రంగంలో “షికాగో ఫుడ్ స్టాప్” దూసుకెళ్తోందని.. ఇదే తరహాలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణలోనూ ఫుడ్‌స్టాప్‌ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆహార ఉత్పత్తుల్లో సృజనాత్మకత, ప్రజల అలవాట్లు, చరిత్రను భద్రపరిచేలా ఈ ఫుడ్ స్టాప్‌ను ఏర్పాటు ఉంటుందని తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా పలు సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రోజున కేటీఆర్.. షికాగో నగరంలో “షికాగో ఫుడ్ ప్రాసెసింగ్ ఎకో సిస్టం”ను అధ్యయనం చేశారు. అక్కడ నెలకొల్పిన ఫుడ్‌స్టాప్‌ను పరిశీలించారు.
అనంతరం “వరల్డ్ బిజినెస్ షికాగో” ఏర్పాటు చేసిన సమావేశంలో ‘ఆహారంలో సృజనాత్మకత’ అనే అంశంపై మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. “ఆహార శుద్ధి పరిశ్రమ రంగంలో సృజనాత్మకతకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఇవి పరిశ్రమలుగానే కాక వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన రైతులు, ప్రజల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో అద్భుతంగా పురోగమిస్తోంది. పంటలు, పాలు, మాంసం, చేపలు, వంట నూనెల ఉత్పత్తిలో విప్లవాత్మక అభివృద్ధి సాధించింది.” అని కేటీఆర్ తెలిపారు.