కొండపోచమ్మ సాగర్‌లో ప్రమాదవశాత్తు ఐదుగురు యువకులు మరణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… యువకుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యుక్త వయసులోనే యువకులు అకాల మరణం చెందడం కుటుంబాలకు తీరని లోటు.. తీవ్ర విషాదంలో ఉన్న ఆయా కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలి అని కోరారు కేటీఆర్.
అటు సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ లో హైదరాబాద్ కు చెందిన ఐదుగురు యువకులు గల్లంతై మృతి చెందడం పట్ల మాజీమంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు అకాల మరణం చెందటం మనస్సును కలిచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు కోరారు. పండుగ వేళ బిడ్డల్ని కోల్పోయి బాధలో ఉన్న కుటుంబాలకు రూ. 15 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.