తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ ప్రక్రియ జోరందుకుంది. ఇవాళ శుభ ముహూర్తం ఉండటంతో చాలా మంది కీలక నేతలు ఈరోజే నామపత్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా ఇతర నేతలు ఈరోజు నామినేషన్ వేయనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉ.11.45 గం.కు కేటీఆర్ ఎన్నికల అధికారికి నామపత్రాలు సమర్పించనున్నారు.
మరోవైపు రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు కూడా ఇవాళ నామినేషన్ వేయనున్నారు. సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి హరీశ్ రావు నేడు నామపత్రాలు దాఖలు చేస్తారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ వేస్తారు. ఉదయం 11 గంటలకు గజ్వేల్‌లో నామినేషన్ వేయనున్న కేసీఆర్.. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామపత్రాలు దాఖలు చేయనున్నారు. నామినేషన్ అనంతరం కామారెడ్డిలో బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు.