కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి: కేటీఆర్‌

-

పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి నేతలు కాంగ్రెస్ లోకి వలస వెళ్లడంపై తాజాగా మరోసారి ఆయన స్పందించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్‌ అని కేటీఆర్ విమర్శించారు.

కాంగ్రెస్‌ పార్టీ ఫిరాయింపులపై మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోందని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ మారితే సభ్యత్వం రద్దు అనే హామీని ప్రకటించిందని తెలిపారు. పదో షెడ్యూల్‌ చట్ట సవరణ స్వాగతించదగినదని, కానీ కాంగ్రెస్‌ ఎప్పటిలానే చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా వారి విధానాలు ఉంటాయన్న కేటీఆర్.. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ చేర్చుకుందని తెలిపారు. అందులో ఒక ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్‌ ఇచ్చిందని, హామీలపై నిబద్ధత ఉంటే ఈ అంశంపై రాహుల్‌ గాంధీ మాట్లాడాలని డిమాండ్ చేశారు. వారి పార్టీలో చేరిన ఇద్దరితో రాజీనామా చేయించి అనర్హులని స్పీకర్‌ ప్రకటించాలని.. చెప్పిందే చేస్తాం.. అబద్ధాలు చెప్పబోమని కాంగ్రెస్‌ నిరూపించుకోవాలని కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version