అమెరికాలో ప్రతిష్ఠాత్మక “ఫార్మ్ ప్రొగ్రెస్ షో – 2023″కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ నెల 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మూడు రోజులపాటు అమెరికాలోని ఇల్లినాయిస్ డెకాటూర్‌లో ఈ ప్రదర్శన జరగనుంది. ప్రపంచవ్యాప్త వ్యవసాయ పరిశ్రమలో అత్యంత అధునాతన వ్యవసాయ ఉత్పత్తులు, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, రసాయనాలు, యంత్రాలు, విత్తన సాంకేతికతలపై ఈ అంతర్జాతీయ ప్రదర్శన వేదిక కానుంది.
వాతావరణ మార్పుల నేపథ్యంలో కీలక వ్యవసాయ రంగంలో కూలీల కొరత, నకిలీ విత్తనాలు, పెరుగుతున్న పెట్టుబడులు, ప్రధాన సమస్యగా మారాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. దీని కారణంగా నాణ్యమైన అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలు, పెట్టుబడులను తగ్గించడం, రైతు పండించిన ఉత్పత్తులకు… అధిక ధరలను కలిపించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. అమెరికాలో జరగనున్న ఈ వ్యవసాయ ప్రదర్శన దానికి తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయానికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ అనుమతితో అమెరికా వెళ్లేందుకు మంత్రి నిరంజన్ రెడ్డి సిద్ధమయ్యారు.