గజ్వేల్‌, సిద్దిపేటలకు గోదావరి జలాలను ఎందుకు మళ్లిస్తున్నారు? : మంత్రి పొన్నం

-

గోదావరి నీటిని గజ్వేల్‌, సిద్దిపేట, తదితర ప్రాంతాలకు మళ్లిస్తుండటంపై హైదరాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. ఆయా ప్రాంతాల్లో మిషన్‌ భగీరథ పనులు పూర్తయినట్లు గత ప్రభుత్వం ప్రకటించిందని, ఇంకా గోదావరి నీటిని ఎలా తీసుకుంటున్నారని అధికారులను ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి పరిధిలోని పౌర సేవలపై ఆయన బుధవారం రోజున జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఉప మేయర్‌ శ్రీలతరెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌, జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ తదితరులతో ఈ సమావేశంలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌ నీటిని నగరానికే వాడాలని, రాజధానికి వచ్చే నీటిని మధ్యలో 40 ఎంజీడీలను దారి మళ్లించడం సరికాదని మంత్రి పొన్నం అన్నారు. దీనిపై వెంటనే పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. వాస్తవానికి గోదావరి నుంచి నిత్యం నగరానికి 172 ఎంజీడీలను తరలిస్తున్నారు. అందులో 40 ఎంజీడీల వరకు గజ్వేల్‌, సిద్దిపేటకు కేటాయిస్తున్నారు. ఈ నీటి తరలింపునకు అయ్యే విద్యుత్తు ఛార్జీల భారాన్ని జలమండలి భరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాల్లో నీటి సమస్యను వేగంగా పరిష్కరించి, గోదావరి జలాలను 100 శాతం హైదరాబాద్‌కు వినియోగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version