తెలంగాణలో నిరుద్యోగుల సమస్య గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నిరుద్యోగులు ఏళ్ల తరబడి కష్టపడి చదువుతున్నప్పటికీ వారి ఆశలు మాత్రం అడిఆశలుగానే మిగిలిపోతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీ వ్యవహారం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పేపర్ లీకేజీ వల్ల ఎంతో మంది నిరుద్యోగుల కల నెరవేరకుండానే ఉంది. దీంతో నిరుద్యోగులు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పై కాస్త వ్యతిరేకతనే చూపించినట్టు తెలుస్తోంది.
తాజాగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలోనైనా నెరవేరుతాయని ఆశపడుతున్నారు నిరుద్యోగులు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవ్వరిపైనా కక్ష సాధింపులుండవు అని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన పాలసీలు ఉపయోగకరంగా ఉంటే వాటిని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. రాబోయే బడ్జెట్ లో అన్నిరంగాలకు ప్రాధాన్యమిస్తామన్నారు. యువతకు ఉద్యోగ కల్పన దిశగా చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. TSPSC ఆధ్వర్యంలో ఏటా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామన్నారు.