గిట్టుబాటు ధరకే మిర్చి కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వ్యాపారులకు సూచించారు. ఖమ్మం మిర్చి మార్కెట్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన కొనుగోళ్లను స్వయంగా పరిశీలించారు. మార్కెట్లో జరుగుతున్న అవకతవకలను సమీక్షించిన మంత్రి పర్యవేక్షణ కరవైందంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన మిర్చి జెండా పాటలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం రైతులు, వ్యాపారులతో వివిధ అంశాల గురించి చర్చించారు. కొనుగోళ్లలో జాప్యం చేయకూడదన్న తుమ్మల అన్నదాతలకు వెంటనే చెల్లింపులు చేయాలని వ్యాపారులకు సూచించారు. మిర్చి ధరలు గణనీయంగా తగ్గిస్తున్నారని మంత్రి తుమ్మలతో రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు.
కనీస గిట్టుబాటు ధర కూడా లభించడం లేదని రైతులు మంత్రి వద్ద వాపోయారు. అసలే పంటకు తెగుళ్లు రావడంతో బాగా నష్టపోయామని ఇక కూలీ ఖర్చులు కూడా ఎక్కువయ్యాయని వాపోయారు. ఇప్పుడు పలుకుతున్న ధరతో కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా సమకూరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు విన్న మంత్రి తుమ్మల వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.