ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి వివాదాలు కొత్తేం కాదు. ఇప్పటికి పలుమార్లు ఆడియో లీక్స్.. వీడియో లీక్స్‌తో వార్తల్లో నిలిచారు. తాజాగా ముదిరాజ్‌ల మనోభావాలు దెబ్బతినేలా కౌశిక్ మాట్లాడిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సంఘాలు కౌశిక్ రెడ్డిపై ఫైర్ అవుతున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కౌశిక్ రెడ్డి స్పందించారు.
తాను మాట్లాడినట్లుగా ఉన్న ఒక నకిలీ ఆడియోను సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని కౌశిక్ రెడ్డి తెలిపారు. ఆ ఆడియో రికార్డ్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి పరీక్షించాలని కోరారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీకి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.
‘‘తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సామాజికవర్గానికి నిజాలు తెలియాలి. హుజూరాబాద్ నియోజకవర్గంలో నాకు వస్తున్న ఆదరణ చూసి కొందరు కుట్రలు చేస్తున్నారు. ముదిరాజ్‌లకు నన్ను దూరం చేసే విధంగా కుతంత్రాలు పన్నుతున్నారు. ఆ నకిలీ ఆడియోతో ముదిరాజ్‌ల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమాపణ కోరుతున్నా’’ అని తెలిపారు.