ఆరేళ్ల బాలిక హత్యకు గురైంది. అయితే దాన్ని సహజ మరణంగా చిత్రీకరించి అంత్యక్రియలు నిర్వహించేందుకు కన్నతల్లి ప్రయత్నించగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారం కిత్రం జరిగిన ఈ ఘటనపై విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో ఓ వివాహిత.. కుమార్తె జన్మించిన తర్వాత ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరచుకొని అయిదేళ్ల క్రితం ఊరి నుంచి వెళ్లిపోయింది. భువనగిరి సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో పనిచేస్తూ ఆ వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టినట్లు సమాచారం. వారం క్రితం కడుపు నొప్పితో మొదటి బిడ్డ చనిపోయిందని చెబుతూ, అంత్యక్రియలు చేసేందుకు మృతదేహాన్ని పుట్టింటికి తీసుకొచ్చింది.
గ్రామస్థులు డయల్ 100కు ఫోన్ చేసి అనుమానాలు వ్యక్తం చేయగా.. పోలీసులు వెళ్లి అంత్యక్రియలను ఆపి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాలిక గొంతును నులమడం వల్లే మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించడంతో.. తల్లిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.