బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ కావడం ఖాయమని అన్నారు. కొద్దిరోజుల్లో కవిత తీహార్ జైలుకు వెళ్తుందని జోస్యం చెప్పారు. చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుందన్న ఎంపీ.. అందులో భాగంగా మనీశ్ సిసోదియాను అరెస్ట్ చేశారని వివరించారు. ప్రజాగోస, బీజేపీ భరోసా పేరిట హైదరాబాద్ వినయ్‌నగర్‌లో నిర్వహించిన కార్నర్ సమావేశంలో అర్వింద్ కుమార్ పాల్గొన్నారు.
మరోవైపు మనీశ్ సిసోదియా అరెస్ట్‌ను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు విపక్షాలపై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దర్యాప్తు సంస్థల్ని ఉసిగొలిపి దొంగచాటు రాజకీయాలను చేస్తోందని విమర్శించారు. ప్రజాబలం లేక.. అధికారంలోకి రాలేని ప్రాంతాల్లో, అక్కడి పార్టీలను బలహీనపరుస్తోందన్నారు. ఇందులో భాగంగానే సిసోదియాను అరెస్ట్ చేశారని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు.
మరోవైపు సిసోదియా అరెస్టుపై మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాజకీయంగా ఆప్‌ను ఎదుర్కోలేకే సిసోదియాను అరెస్ట్ చేశారని విమర్శించారు. దిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఎంత నీచంగా వ్యవహరించిందో, దేశమంతా చూసిందని అన్నారు.