ముగిసిన వివాదం.. నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఫెన్సింగ్, బారికేడ్లు తొలగింపు

-

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ డ్యాం వద్ద నాలుగు రోజులుగా నీటి కోసం ఏపీ, తెలంగాణల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ వివాదం ఆదివారం ఉదయంతో సమసిపోయింది. ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వం, కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ) స్పందించడంతో ఏపీ ప్రభుత్వం శనివారం రాత్రి కుడికాల్వకు విడుదల చేస్తున్న నీటిని నిలిపివేసింది.

మరోవైపు ఆదివారం ఉదయం ఏపీ, తెలంగాణ నీటి పారుదల శాఖల అధికారులు చర్చించి డ్యాంపై ఏర్పాటు చేసిన ముళ్ల కంచె తొలగించడంతో ఈ వివాదానికి తెరపడింది. డ్యాం ఇరువైపులా తెలంగాణ ఎస్పీఎఫ్‌ బలగాలను తొలగించాలన్న ఏపీ షరతుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవడంతో రెండు రాష్ట్రాల పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు డ్యాం భద్రతను తాత్కాలికంగా సీఆర్పీఎఫ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నీటి వాటాను సక్రమంగా ఇవ్వడం లేదని బుధవారం రాత్రి ఏపీ అధికారులు పోలీసు బలగాలతో డ్యాంపైకి ప్రవేశించి తెలంగాణ అధికారుల అనుమతి లేకుండా కుడి కాల్వ ద్వారా నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. అలా మొదలైన వివాదం చివరకు కేంద్రం రంగంలోకి దిగడంతో సద్దుమణిగి సీఆర్పీఎఫ్ బలగాల ఆధీనంలోకి వెళ్లింది.

Read more RELATED
Recommended to you

Latest news